కూసుమంచి, వెలుగు : ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడుతండాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గోరీలపాడుతండా గ్రామానికి చెందిన బానోతు వీరన్న (45) రుక్కమ్మ భార్యాభర్తలు. రుక్కమ్మకు మునిగేపల్లి గ్రామానికి చెందిన రాంబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరన్న, రుక్కమ్మ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాంబాబు రుక్కమ్మ ఇంటికి రావడంతో గమనించిన వీరన్న ఇద్దరితోన గొడవకు దిగాడు. దీంతో రుక్కమ్మ, రాంబాబు కలిసి కొబ్బరిబోండాలు నరికే కత్తితో వీరన్న దాడి చేయగా... తల, చెవి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన వీరన్న కొడుకుకు ఆవరణలో రక్తం మరకలు కనిపించడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా.. రక్తపుమడుగులో తండ్రి కనిపించాడు. దీంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
అనంతరం వీరన్నను 108లో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. పరారీలో ఉన్న రుకమ్మ, రాంబాబు కోసం గాలిస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.
